ఎల్కతుర్తి, మార్చి 09( తెలంగాణ అనుక్షణం):పెళ్లి కావడం లేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రామకృష్ణాపురంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణపురానికి చెందిన బొంత కుమారస్వామికి ఒక కుమారుడు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహం కాగా చిన్న కూతురు బొంత రమ్య(22) తల్లిదండ్రులతో వ్యవసాయ పనులకు వెళుతూ ఇంటివద్దె ఉంటుంది. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులతో తనకు పెళ్లి కావడం లేదని పదేపదే చెబుతూ బాధపడుతూ ఉండేది. దానితో తల్లిదండ్రులు అయితదిలే తొందరపడకు అని సముదాయిస్తూ ఉండేవారు. కానీ రమ్య అదే పనిగా పెళ్లి గురించి ఆలోచన చేస్తూ తనకు పెళ్లి కాదు అని భావించి మనస్థాపంతో కుటుంబ సభ్యులు అందరూ పడుకున్న తర్వాత ఈనెల 7న రాత్రి పది గంటలకు ఇంట్లో ఉన్న గడ్డి మందు త్రాగింది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన తల్లిదండ్రులు 108 లో ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు. ఆనాటి నుండి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 12 గంటల పది నిమిషాలకు మృతి చెందింది. మృతురాలి తండ్రి కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
పెళ్లి కావడం లేదని మనస్థాపంతో యువతి ఆత్మహత్య